tomato: టమాటా, ఉల్లి ధరల అస్థిరతలకు ‘ఆర్థిక సర్వే’ పరిష్కారం
- సీజనాలిటీ ప్రభావం
- ఒక సీజన్ లోనే 70 శాతం దిగుబడి
- మరో సీజన్ లో 30 శాతానికి పరిమితం
- సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి
టమాటా ధర కిలో రూ.5కు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో రూ.100 కూడా దాటిపోతుంది. అలాగే ఉల్లిగడ్డల ధర రూ.20 నుంచి రూ.100 మధ్య చలిస్తూ ఉంటుంది. వీటి ధరలు ఇలా తీవ్ర అస్థిరతలకు లోను కావడం వినియోగదారులను అసౌకర్యానికి గురి చేస్తుంటుంది. ముఖ్యంగా ధరలు భారీగా పెరిగిపోయిన సందర్భాల్లో కొనుగోలుదారులపై ఎంతో భారం పడుతుంది. డిమాంకు సరిపడా సరఫరా లేకపోవడం, డిమాండ్ కు మించి సరఫరా ఉండడమే వీటి ధరల హెచ్చు తగ్గులకు కారణం. దీనికి కేంద్ర ఆర్థిక సర్వే ఒక పరిష్కారాన్ని సూచించింది.
టమాటా, ఉల్లి ధరలు ‘సీజనాలిటీ’ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. లీన్ సీజన్ లోనూ వీటి సాగు పెరిగేలా చూడాలని ఆర్థిక సర్వే సూచించింది. సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి తగిన విధానాలను రూపొందించాలని సూచించింది. దీనికి అదనంగా మిగులు టమాటాల ప్రాసెసింగ్ ను ప్రోత్సహించాలని, ఉల్లిగడ్డల ప్రాసెసింగ్, స్టోరేజీ సదుపాయాలు కల్పించాలని పేర్కొంది.
‘‘ఉత్పత్తి వృధా కాకుండా చూడాలి. సరఫరా వ్యవస్థ నిర్వహణ మెరుగ్గా ఉండాలి. కాలానుగుణ అంశాలు ప్రభావం చూపిస్తుండడంతో జులై-నవంబర్ మధ్య వీటి ధరలు పెరిగిపోతున్నాయి’’ అని సర్వే తెలిపింది. 70 శాతం టమాటా సాగు రబీ సీజన్ లోనే నమోదవుతున్న విషయాన్ని ప్రస్తావించింది. జులై-నవంబర్ మధ్య ఖరీఫ్ సీజన్ లో కేవలం 30 శాతం టమాటాయే ఉత్పత్తి అవుతున్నట్టు వెల్లడించింది.
అలాగే ఉల్లిగడ్డలు కూడా 70 శాతం సాగు డిసెంబర్-జనవరి సీజన్ లో మొదలై మార్చి-మే చివరికి దిగుబడిగా వస్తున్నట్టు పేర్కొంది. ఇలా కాకుండా రెండు సీజన్లలోనూ దిగుబడి ఇంచుమించు ఒకే మాదిరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది.