Vadakara Hospital: ప్రచార ప్రకటనలో నల్లజాతి హాలీవుడ్ నటుడి ఫొటో వాడుకున్న కేరళ హాస్పిటల్.. విమర్శల వెల్లువ!
- వడకరా ఆసుపత్రి నిర్వాకం
- నల్ల రంగు పోగొడతామంటూ ప్రచారం
- మోర్గాన్ ఫ్రీమాన్ ఫొటోతో యాడ్
- మండిపడిన నెటిజన్లు
ఇంగ్లీషు సినిమాలు ఎక్కువగా చూసేవారికి మోర్గాన్ ఫ్రీమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోర్గాన్ ఫ్రీమాన్ హాలీవుడ్ లో లెజెండరీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. నల్లజాతి ఆణిముత్యంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. అయితే, కేరళలోని ఓ ఆసుపత్రి ఆయన ఫొటోను తమ ప్రచారం కోసం వాడుకుని తీవ్ర విమర్శల పాలైంది. కోజికోడ్ లో ఉన్న వడకరా కోఆపరేటివ్ ఆసుపత్రి ఇటీవల ఓ ప్రచార ప్రకటన రూపొందించింది.
ముఖంపై మచ్చలు, మొటిమలు, పులిపిర్లు, నల్ల రంగు తొలగిస్తామన్న ఆ ప్రకటన సారాంశం. అయితే, ఆ ప్రకటనలో మోర్గాన్ ఫ్రీమాన్ ముఖాన్ని వాడుకున్నారు. ఆయన ముఖం నల్లగా, కొద్దిగా మచ్చలతో ఉంటుంది. సోషల్ మీడియాలో దీనిపై దుమారం రేగింది. నెటిజన్లు వడకరా ఆసుపత్రి వర్గాలను తిట్టిపోశారు. అంతర్జాతీయ నటుడ్ని ఈ విధంగా అవమానిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ ప్రజల ప్రపంచ దృక్పథాన్ని కూడా ఇది కించపరిచేలా ఉందని మండిపడ్డారు.
దాంతో తప్పు తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం వెంటనే క్షమాపణలు చెప్పడమే కాదు, ఆ ప్రచార ప్రకటనను తొలగించింది. దీనిపై వడకరా ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ టి.సునీల్ స్పందిస్తూ, మోర్గాన్ ఫ్రీమాన్ ఫొటోను ఇంటర్నెట్ నుంచి తీసుకున్నామని, తమ ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డు వద్ద జనవరి 26న ప్రదర్శించామని వెల్లడించారు. అయితే విమర్శలు వస్తున్న విషయం తెలియడంతో దాన్ని తొలగించామని చెప్పారు.