Tamil Nadu: మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం రండి.. జగన్, చంద్రబాబు, పవన్ సహా 37 పార్టీల అధినేతలకు స్టాలిన్ లేఖ
- అందరం ఏకతాటిపైకి వస్తే తప్ప మతోన్మాద శక్తులపై పోరాడడం సాధ్యం కాదన్న స్టాలిన్
- ‘అఖిల భారత సామాజిక న్యాయ సమాఖ్య’లో చేరాలని పిలుపు
- బీజేపీని పక్కనపెట్టిన వైనం
మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం రండంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దేశంలోని 37 పార్టీలకు లేఖ రాశారు. సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయంపై విశ్వాసమున్న వారంతా ఏకతాటిపైకి వచ్చి మతోన్మాదం, మతపరమైన ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలని ఆ లేఖలో ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అందరం ఏకతాటిపైకి వస్తే తప్ప ఈ శక్తులపై పోరాడడం సాధ్యం కాదన్నారు. ఇందుకోసం ‘అఖిల భారత సామాజిక న్యాయ సమాఖ్య’లో చేరాలని కోరారు.
ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యకుడు పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులకు స్టాలిన్ లేఖలు రాశారు. మొత్తంగా 37 పార్టీలకు లేఖలు రాసిన ఆయన బీజేపీని మాత్రం పక్కనపెట్టడం గమనార్హం.