Andhra Pradesh: ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. చలి నుంచి విముక్తి
- ఒకటి నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
- అనంతపురంలో గరిష్ఠంగా 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- ఏజెన్సీ, రాయలసీమ శివారు ప్రాంతాల్లో మాత్రం చలి వాతావరణం
నిన్న, మొన్నటి వరకు చలితో అల్లాడిపోయిన జనానికి ఇది కొంత వేడి పుట్టించే వార్తే. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా చలి ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. నిన్న ఆరోగ్యవరంలో 16. 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలో అత్యధిక ప్రాంతాలు, కోస్తాలో పలుచోట్ల ఎండలు పెరిగినట్టు వాతావరణశాఖ తెలిపింది.
అనంతపురంలో అత్యధికంగా 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా, రాయలసీమల్లోనూ పొడి వాతావరణం ఉందని, వచ్చే రెండు రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. కాగా, వాయవ్య దిశ నుంచి గాలులు వీస్తుండడంతో విశాఖ ఏజెన్సీతోపాటు రాయలసీమ శివారు ప్రాంతాల్లో మాత్రం చలి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.