India: గల్వాన్ ఘర్షణకు మూల్యం చెల్లించుకున్న చైనా.. భారత్ కంటే రెట్టింపు ప్రాణ నష్టం!
- భారత్ వైపు 20 మంది సైనికుల దుర్మరణం
- తమ వైపు నలుగేరనన్న చైనా
- కనీసం 37 మంది మరణించి ఉంటారు
- ఆస్ట్రేలియా పత్రిక సంచలనాత్మక కథనం
లోయ సమీపంలో 2020 జూన్ 15న ఇరు దేశ సైనికుల మధ్య ఘర్షణను చరిత్ర ఎప్పటికీ మరవదు. ముఖ్యంగా చైనాకు ఇది ఎప్పటికీ జీర్ణించుకోలేని ఘటనగానే మిగిలిపోనుంది. ఎందుకంటే నాడు ఘర్షణకు కాలుదువ్వింది చైనాయే. ఇరు దేశ సైనికులు ఆయుధాలకు బదులు చేతులతో ముష్టి యుద్ధానికి దిగడం తెలిసిందే. భారత్ 20 మంది సైనికుల ప్రాణాలను కోల్పోయింది. కానీ, చైనా మాత్రం ప్రాణ నష్టం వివరాలు బయటపెట్టలేదు. నలుగురు చనిపోయినట్టు ఆలస్యంగా 2021 ఫిబ్రవరిలో ప్రకటించింది.
భారత్ వైపు కంటే చైనా వైపే ఎక్కువ ప్రాణ నష్టం జరిగి ఉంటుందని అప్పట్లోనే కొన్ని వార్తలు వచ్చాయి. అయినా చైనా అంగీకరించలేదు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధనాత్మక వార్తా పత్రిక ఒకటి ఇందుకు సంబంధించి ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. చీకట్లో వేగంగా ప్రవహిస్తున్న నదిని దాటే క్రమంలో కనీసం 37 మంది చైనా సైనికులు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
చైనా బ్లాగర్ల మధ్య జరిగిన చర్చలు, చైనా పౌరుల నుంచి సమీకరించిన సమాచారం, చైనా పత్రికలు ప్రచురించిన వార్తలు ఆధారంగా ఆస్ట్రేలియన్ పత్రిక ఈ కథనాన్ని రూపొందించింది. చైనా చెబుతున్నట్టు నాడు నలుగురు సైనికుల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఈ కథనంలో తెలిపింది.