Rahul Gandhi: 'ఇటలీ తల్లి, ఇండియన్ తండ్రి.. అందుకే రాహుల్ ఆలోచనల్లోనే తేడా'.. హర్యానా హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- రాహుల్ 'రెండు భారత్'ల వ్యాఖ్యలకు కౌంటర్
- పుట్టుక ఆధారంగానే ఆయనకు ఆ ఆలోచనలంటూ విమర్శ
- సహజంగానే భారత్ రెండుగా కనిపిస్తుందని కామెంట్
‘రెండు భారత్’లు అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తీవ్రంగా స్పందించారు. అతడి పుట్టుక ఆధారంగానే రాహుల్ ఆలోచనలు ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇటలీ తల్లి, ఇండియన్ తండ్రి అడుగుజాడల్లో పెరిగిన గాంధీ వారసుడికి.. ఒకటే భారత్ కు బదులు రెండు భారత్ లు కనిపిస్తున్నాయని మండిపడ్డారు.
‘‘రాహుల్ గాంధీకి రెండు భారత్ లు కనిపించడం సహజమే. ఎందుకంటే ఆయన రెండు సంస్కృతుల్లో పెరిగాడు మరి. తల్లి సోనియా గాంధీనేమో ఇటలీ పౌరురాలు. తండ్రి రాజీవ్ గాంధీ భారతీయుడు. అందుకే ఆ రెండు దేశాల సంస్కృతులూ రాహుల్ కు ఒంటబట్టాయి. అందుకేనేమో అతడి ఆలోచనల్లోనే ఏదో తేడా ఉంటోంది’’ అంటూ ట్వీట్ చేశారు.
నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ధనికులకు ఓ భారత్, పేద వారికో భారత్.. అంటూ భారత దేశం రెండుగా విడిపోయిందని వ్యాఖ్యానించారు. పేద, ధనికుల మధ్య అంతరం నానాటికీ పెరుగుతూనే ఉందని అసహనం వ్యక్తం చేశారు.