Balineni Srinivasa Reddy: ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు: మంత్రి బాలినేని
- చిన్నచిన్న సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోండి
- తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం
- జగన్ సీఎం అయిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారు
ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమయింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించినా... ఉద్యోగులు ఏ మాత్రం తగ్గలేదు. వేలాదిగా నగరానికి చేరుకున్న ఉద్యోగులు... చెప్పినట్టుగానే తమ నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే... ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నారని అన్నారు. చిన్నచిన్న సమస్యలను ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని చెప్పారు. జగన్ సీఎం అయిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారని, చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని అన్నారు.
విద్యుత్ ఉద్యోగుల విషయంలో కూడా సీఎంతో మాట్లాడిన తర్వాత ఒకేసారి నాలుగు డీఏలు ఇచ్చామని చెప్పారు. విద్యుత్ శాఖలో పీఆర్సీపై మార్చిలో వేయాల్సిన కమిటీని ఇప్పుడే వేశామని అన్నారు. కరోనా వల్ల రాష్ట్రం ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను ఉద్యోగులు గుర్తించాలని చెప్పారు.
ఇక మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ గురించి ఆయన మాట్లాడుతూ, పార్లమెంటు సెగ్మెంట్ ఆధారంగానే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రాంతాల వారీగా జిల్లాల ఏర్పాటు జరిగే అవకాశం ఉంటే మొట్టమొదటగా మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని తెలిపారు.