Sajjala Ramakrishna Reddy: మీకు పదోన్నతులు కల్పిస్తున్న సీఎంను ఆ విధంగా మాట్లాడతారా?: ఉపాధ్యాయులపై సజ్జల అసంతృప్తి

Sajjala disappoints with teachers comments on CM Jagan

  • ఉద్యోగుల ఛలో విజయవాడ విజయవంతం
  • బలప్రదర్శనతో ఏం సాధిస్తారన్న సజ్జల
  • చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని వ్యాఖ్య 

డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు సీఎం జగన్ పై మాట్లాడుతున్న తీరు సరిగాలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలమంది ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పిస్తున్న సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఉపాధ్యాయులకు ఏడెనిమిది విషయాల్లో తాము ఉపకారం చేశామని సజ్జల స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే  స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు వచ్చినట్టు ఉపాధ్యాయులే చెప్పారని అన్నారు.

గత ప్రభుత్వంలో లేని ఉద్యోగ భద్రతను తాము కల్పించామని ఉద్ఘాటించారు. కరోనా వ్యాప్తి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏవిధంగా మారిందో అందరికీ తెలుసుని, మరోపక్క సంక్షేమానికి కూడా నిధులు అవసరమైన పరిస్థితి తలెత్తిందని వివరించారు. కొవిడ్ కారణంగా ఏర్పడిన సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియదని, చర్చల సమయంలో ఉద్యోగులకు పరిస్థితి వివరించినా అర్థం చేసుకోలేదని సజ్జల విమర్శించారు.

పీఆర్సీని ఏ విధంగా రూపొందించారో ప్రభుత్వం వివరించిందని, ఉన్నంతలో మంచి ప్యాకేజీ ఇచ్చామని వెల్లడించారు. కానీ ఉద్యోగులను రోజూ చర్చలకు పిలుస్తున్నా, స్పందన లేదని ఆరోపించారు. బలప్రదర్శన చేయడం వల్ల సమస్య జటిలం అవుతుందని అన్నారు. ఇవాళ చేపట్టిన ప్రదర్శనతోను, 6వ తేదీ అర్ధరాత్రి నుంచే చేపట్టే సమ్మెతోనూ ఉద్యోగులు ఏం సాధిస్తారో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News