Kapu: కాపులకు ఊరట... తుని ఘటనలో నమోదైన కేసుల ఎత్తివేత
- 2016లో ఉద్ధృతంగా కాపు ఉద్యమం
- ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో పోరుబాట
- తునిలో భారీ బహిరంగ సభ
- రైలుకు నిప్పంటించిన ఆందోళనకారులు
రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో 2016లో కాపు ఉద్యమం ఉద్ధృతంగా సాగిన సంగతి తెలిసిందే. అయితే, నాడు తునిలో జరిగిన కాపుల బహిరంగ సభ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టారు. దాంతో ఈ ఘటనకు సంబంధించి కాపులపై 69 కేసులు నమోదయ్యాయి. ఇతర అంశాలపైనా కేసులన్నీ కలిపి 161 వరకు ఉంటాయి.
ఈ నేపథ్యంలో కాపులకు ఊరట కల్పించేలా తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైలును దగ్ధం చేసిన ఘటనలో కాపులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ప్రత్యేక జీవో జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కాపులపై నమోదైన కేసులు తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.