NTPC: బకాయిలు చెల్లించని ఏపీ ప్రభుత్వం.. విద్యుత్ సరఫరా ఆపేసిన ఎన్‌టీపీసీ
- 2 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాను ఆపేసిన ఎన్‌టీపీసీ
- బొగ్గు నిల్వలు లేకపోవడంతో ఆర్‌టీపీపీలోని మరో యూనిట్‌లో సాధ్యం కాని ఉత్పత్తి
- కృష్ణపట్నం యూనిట్‌లో సాంకేతిక సమస్య
- డిమాండ్‌ను తట్టుకునేందుకు కోతలు
తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాను ఒక్కసారిగా ఆపేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ లోటును రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్‌టీపీపీ) ద్వారా భర్తీ చేయాలని భావించారు.
అక్కడ మరో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని ఆదేశించారు. అయితే, అందుకు సరిపడా బొగ్గు నిల్వలు లేవని ఆర్‌టీపీపీ స్పష్టం చేయడంతో ఇంధన శాఖకు ఏం చేయాలో పాలుపోలేదు. మరోవైపు, అదే సమయంలో కృష్ణపట్నం యూనిట్‌లో సాంకేతిక సమస్య కారణంగా 810 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ కూడా ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా కరెంటు సరఫరా చేయలేక కోతలు విధించారు.