Pakistan: వందమందికిపైగా పాక్ సైనికులను హతమార్చాం: బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన

Killed more than 100 soldiers at military camps in Pakistan BLA

  • బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని పంజ్‌గుర్, నౌష్కీ జిల్లాల్లో ఘటన
  • రెండు సైనిక శిబిరాలపై దాడులు
  • శిబిరాలు తమ నియంత్రణలోనే ఉన్నాయన్న బీఎల్ఏ
  • పూర్తి విరుద్ధంగా పాక్ సైన్యం ప్రకటన

బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడిలో వందమందికిపైగా పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని పంజ్‌గుర్, నౌష్కీ జిల్లాల్లో రెండు పాక్ సైనిక శిబిరాలపై బుధవారం రాత్రి బీఎల్ఏ ఆత్మాహుతి దాడులకు దిగింది. ఈ రెండు ఘటనల్లో వందమందికిపైగా పాక్ సైనికులు హతమైనట్టు బీఎల్ఏ ప్రకటించింది. ఈ శిబిరాలు ప్రస్తుతం తమ అధీనంలోనే ఉన్నట్టు తెలిపింది.

అయితే, పాక్ ఆర్మీ వాదన మాత్రం భిన్నంగా ఉంది. దాడి జరిగిన మాట వాస్తవమేనని, దీనిని సమర్థంగా తిప్పికొట్టినట్టు తెలిపింది. ఈ ఘటనలో బీఎల్‌ఏకు చెందిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పేర్కొంది. అలాగే, తమ వైపు నుంచి ఒక సైనికుడిని కోల్పోయినట్టు తెలిపింది. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బీజింగ్ వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఈ ఘటన జరగడం గమనార్హం.

బలూచ్ ఆర్మీ దాడిపై ఇమ్రాన్ స్పందిస్తూ.. ఉగ్రదాడులను సైన్యం సమర్థంగా తిప్పికొట్టినట్టు తెలిపారు. వారికి సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. కాగా, గత వారం గద్వార్ ఓడ రేవు సమీపంలోని ఆర్మీ పోస్టుపై దాడిచేసిన బీఎల్‌ఏ పదిమంది సైనికులను హతమార్చింది.

  • Loading...

More Telugu News