thyroid: ఈ ‘సూపర్ ఫుడ్స్’ తో థైరాయిడ్ సమస్యలకు చెక్!
- శరీర జీవక్రియల్లో థైరాయిడ్ పాత్ర కీలకం
- గతి తప్పకుండా చూసుకోవాలి
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం పరిష్కారం
- ఉసిరి, కొబ్బరితో ఉపయోగం
సీతాకోక చిలుక ఆకారంలో గొంతు భాగంలో ఉండేదే థైరాయిడ్ గ్రంధి. శరీర జీవ క్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంటుంది. కనుక థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
నేటి జీవనశైలి మార్పులు థైరాయిడ్ గ్రంధిపై ప్రభావం చూపిస్తున్నాయి. పోషకాహారం లేకపోవడం, ఒత్తిడి, గతి తప్పిన నిద్రావేళలు ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఈ గ్రంధి పనితీరు క్రమం తప్పుతోంది. థైరాయిడ్ ఆరోగ్యం చక్కగా ఉండేందుకు ఉపయోగపడే మంచి ఆహార పదార్థాల గురించి ఆయుర్వేద డాక్టర్ దీక్షా భవ్ సార్ వెల్లడించారు. హైపో థైరాయిడిజమ్, హైపర్ థైరాయిడిజమ్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లతో బాధపడే వారికి వీటితో ఉపయోగం ఉంటుంది.
ఆమ్ల (ఉసిరి)
నారింజ/కమలా వంటి సిట్రస్ జాతి పండ్లతో పోలిస్తే విటమిన్ సీ ఉసిరిలో ఎనిమిది రెట్లు అధికంగా ఉంటుంది. దానిమ్మతో పోలిస్తే 17 రెట్లు ఎక్కువగా లభిస్తుంది. శిరోజాలకు ఎంతో మంచిది. జుట్టు తెల్లబడడాన్ని నిరోధిస్తుంది. శిరోజాల కుదుళ్లను బలంగా మారుస్తుంది. రక్త సరఫరా మెరుగ్గా ఉండడంలో సాయపడుతుంది కనుక ధైరాయిడ్ నియంత్రణలోనూ సాయంగా నిలుస్తుంది.
కొబ్బరి (కోకోనట్)
థైరాయిడ్ సమస్యతో ఉన్నవారు నేరుగా కొబ్బరి తినడం లేదంటే కొబ్బరి నూనెను వంటల్లో భాగంగా తీసుకోవాలి. నిదానించిన శరీర జీవక్రియల్లో చురుకుదనం తీసుకొస్తుంది. కొబ్బరిలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ జీవక్రియలకు మేలు చేస్తాయి.
గుమ్మడి విత్తులు (పంప్ కిన్ సీడ్స్)
గుమ్మడి విత్తనాల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇతర విటమిన్స్, మినరల్స్ ను శరీరం గ్రహించడంలో జింక్ పాత్ర కీలకం. అలాగే ధైరాయిడ్ హర్మోన్ బ్యాలన్సింగ్ కు కూడా సాయపడుతుంది.
మూంగ్ బీన్స్ (ముడి పెసర)
ముడి పెసర గింజల్లో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. మలబద్ధకం లేకుండా చూసుకోవాలంటే ఫైబర్ తీసుకోవడం ఎంతో అవసరం. థైరాయిడ్ పనితీరు గతి తప్పడానికి మలబద్ధకం కూడా ఒక కారణం.