Telangana: తండ్రిలాగే తనయుడు.. ఎప్పుడూ సెక్యూరిటీని కోరుకోని అసదుద్దీన్ ఒవైసీ!

MIM MP Asaduddin Never Wanted Security

  • కేంద్రం ‘జెడ్’ సెక్యూరిటీ ఇచ్చినా వద్దన్న ఎంపీ
  • 1994లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే అంతే
  • బైకుపైనే ఒంటరిగా ప్రజల దగ్గరకు

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం ‘జెడ్’ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అయితే, తనకే భద్రతా వద్దంటూ ఆయన తిరస్కరించారు. ఇప్పుడే కాదు.. అసలు ముందు నుంచీ అసదుద్దీన్ ఒవైసీ ‘ప్రభుత్వ భద్రతే’ తీసుకోలేదు.

హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో ప్రజలను కలిసేందుకు ఆయన ఒంటరిగానే బైకుపై బయటకు వెళ్లిపోతారు. 1980ల్లో ఆయన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ కూడా ఒంటరిగా బైకుపై వెళ్లేవారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన తర్వాతి కాలంలో సెక్యూరిటీని తీసుకున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బైకుపై వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ‘‘నన్ను ఎవరు చంపుతారో చంపనివ్వండి. నేను మాత్రం ఇలా ఒంటరిగానే వెళ్తాను’’ అని ఆయన తాజా కాల్పుల ఘటన తర్వాత వ్యాఖ్యానించారు కూడా. 1994లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రభుత్వం భద్రత కల్పించినా ఆయన తీసుకోలేదు. నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచినా.. ఆయన తిరస్కరించేవారని ఓ ఎంఐఎం నేత చెప్పారు.

అయితే, ప్రభుత్వ భద్రత లేకపోయినా.. ఆయన వెనుకే కొందరు బైకులపై రక్షణగా వెళ్తుంటారు. తన తమ్ముడు అక్బరుద్దీన్ పై దాడి జరిగిన సమయంలోనూ ఆయన భద్రత వద్దన్నారు. దాడికి ముందు అక్బరుద్దీన్ కూడా ఎప్పుడూ భద్రత లేకుండానే వెళ్లేవారు. ప్రస్తుతం బుల్లెట్ కారుతో పాటు ప్రభుత్వం భద్రతను కల్పించింది.

  • Loading...

More Telugu News