Rahul Gandhi: మోదీ ప్రధాని కాదు... ఒక రాజు లాంటి వాడు: రాహుల్ గాంధీ
- ఉత్తరాఖండ్ లో రాహుల్ ఎన్నికల ప్రచారం
- కిచ్చాలో వర్చువల్ సభ
- రైతులను ఏడాదిపాటు రోడ్లపై దయనీయ స్థితిలో వదిలేశారంటూ విమర్శ
- రైతులకు కాంగ్రెస్ మిత్రపక్షమని వ్యాఖ్య
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. భారతదేశానికి ప్రస్తుతం ఉన్నది ప్రధానమంత్రి కాదని, తాను నిర్ణయం తీసుకుంటే ప్రజలంతా నోరుమూసుకుని ఉండాలని భావించే ఒక రాజు అని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ నేడు ఉద్ధమ్ సింగ్ నగర్ లోని కిచ్చా ప్రాంతంలో ఓ వర్చువల్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సంక్షోభం సమయంలో రైతులను ఏడాదిపాటు రోడ్లపై దయనీయ స్థితిలో వదిలేశారని మోదీ సర్కారుపై విమర్శించారు. కానీ కాంగ్రెస్ ఎప్పటికీ అలా చేయదని స్పష్టం చేశారు. రైతులకు, యువతకు, కార్మికులు, పేదలకు కాంగ్రెస్ ఎప్పుడూ తలుపులు మూయదని వివరించారు. అన్ని వర్గాల ప్రజలతో తమ పార్టీ భాగస్వామ్యం కోరుకుంటుందని రాహుల్ ఉద్ఘాటించారు.
అంతేకాదు, తమ దృఢవైఖరితో మూడు వ్యవసాయ చట్టాలకు ఎదురొడ్డి పోరాడిన రైతులను ఆయన అభినందించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై పోరాడి విజయం సాధించారని కితాబునిచ్చారు.