Under-19 World Cup: ఇంగ్లం‌డ్‌పై భారత కుర్రాళ్ల జయభేరి.. విశ్వవిజేతగా భారత్!

India beat england in under 19 world cup by 4 wickets in final

  • ఇంగ్లండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో మట్టికరిపించిన భారత్
  • భారత బౌలింగ్ దెబ్బకు చిగురుటాకులా వణికిన ఇంగ్లండ్
  • అర్ధ సెంచరీలతో అదరగొట్టిన షేక్ రషీద్, నిశాంత్ సింధు
  • 5 వికెట్లు తీసిన రాజ్ బవాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

భారత కుర్రాళ్లు చెలరేగిపోయారు. అద్వితీయ ఆటతీరుతో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపారు. దేశానికి ఐదో ప్రపంచకప్ అందించారు. అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా  గత రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన తుది సమరంలో యువ భారత్ మరోమారు కలిసికట్టుగా రాణించింది. ఇంగ్లండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 190 పరుగుల విజయ లక్ష్యాన్ని 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

లక్ష్య ఛేదనలో భారత్ తొలుత కొంత తడబడినట్టు కనిపించింది. ఖాతా తెరవకుండానే ఓపెనర్ రఘువంశీ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ చక్కని సమయస్ఫూర్తితో ఆడాడు. ఓపెనర్ హర్నూర్ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 21 పరుగులు చేసిన సింగ్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న కెప్టెన్ యశ్ ధుల్ (17) కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో ఇంగ్లండ్ పట్టుబిగించింది.

మరోవైపు, భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నిశాంత్ సింధు‌తో కలిసి రషీద్ సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించారు. రషీద్ అర్ధ సెంచరీ చేసి అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాజ్ బవా చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. 35 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆశలను వమ్ము చేశాడు. కౌశల్ తాంబే (1) వచ్చినంత వేగంగా పెవిలియన్ చేరినా వికెట్ కీపర్ దినేశ్ బానా (13)తో కలిసి నిశాంత్ ఎలాంటి తొట్రుపాటు లేకుండా ఆడాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అజేయంగా నిలిచి జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు.

అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు బెంబేలెత్తారు. ముఖ్యంగా రాజ్ బవా పదునైన బంతులు ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకున్నారు. మరోవైపు, రవికుమార్ దాడితో ఇంగ్లండ్ వణికిపోయింది. దీంతో 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే, జేమ్స్ రెవ్ అద్భుత పోరాట పటిమ ప్రదర్శించాడు.

బౌలర్లను ఎదురొడ్డుతో 95 పరుగులు చేసి జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. అతడి చలువతో 100 పరుగుల్లోపే కుప్పకూలుతుందని భావించిన జట్టు ఏకంగా 189 పరుగులు చేసి భారత్‌కు సవాలు విసిరింది. జట్టులో అతడి తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు జేమ్స్ సేల్స్. 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రాజ్‌బవా 5 వికెట్లు తీసుకోగా, రవికుమార్‌కు 4 వికెట్లు దక్కాయి. కౌశల్ తాంబేకు ఓ వికెట్ దక్కింది. ఐదు వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రాజ్ బవాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News