Narendra Modi: సినిమాలే కాదు.. దేశ ప్రగతినీ కాంక్షించారు.. లతా మంగేష్కర్ మరణం దు:ఖం కలిగిస్తోందన్న ప్రధాని
- ఆ బాధను మాటల్లో వివరించలేను
- ఎంతో దయామయురాలు
- ఎంతో ఆప్యాయంగా చూసేవారన్న ప్రధాని
ప్రముఖ గాయని లతామంగేష్కర్ మరణంపట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆ బాధను మాటల్లో వివరించలేనని అన్నారు. ఎంతో దయామయురాలు లతా దీదీ అందరినీ విడిచి వెళ్లిపోయారని, ఎవరూ పూడ్చలేని లోటును మిగిల్చి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. సుస్వరాల మధుర గళంతో ప్రజలందరినీ మైమరపింపజేసిన ఆమె.. భారత సంస్కృతికి ఓ గొప్ప వ్యక్తిగా ముందు తరాలు గుర్తుంచుకుంటాయని పేర్కొన్నారు.
ఆమె పాడిన పాటలు ఎన్నెన్నో భావుకతలను అందరి మదిలో నింపాయని, ప్రపంచంలో భారత చిత్ర పరిశ్రమ ఎదుగుదలను ఆమె దగ్గరుండి చూశారని కొనియాడారు. సినిమాలే కాకుండా భారతదేశ ప్రగతి కోసమూ లత కృషి చేశారని ప్రశంసించారు. దృఢమైన అభివృద్ధి భారతాన్ని ఆమె ఎల్లప్పుడూ కోరుకునేవారని గుర్తు చేశారు.
లత దీదీ తనను ఎంతో ఆప్యాయంగా చూసేవారని, అంత ఆప్యాయతను పొందిన తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని మోదీ అన్నారు. ఆమెతో తనకున్న మధురానుభూతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. లత మరణం తోటి భారతీయులతో పాటు తనకూ దు:ఖం కలిగిస్తోందన్నారు. కాగా, లత కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.