Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆస్తులు ఎన్ని వందల కోట్లంటే..!
- 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన లతా మంగేష్కర్
- తన కెరీర్లో దాదాపు 50 వేల పాటలను పాడిన లత
- ఆమె ఆస్తుల విలువ రూ. 200 కోట్లకు పైనే
దశాబ్దాల పాటు తన సుమధుర గానంతో కోట్లాది మందిని మైమరపించిన గానకోకిల లతా మంగేష్కర్ మృతి అందరినీ కలచివేస్తోంది. 92 ఏళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
సినీ పరిశ్రమలోకి ఆమె ఆగమనం అంత ఈజీగా జరగలేదు. తొలి రోజుల్లో స్వరం బాగోలేదని ఆమెను దర్శకనిర్మాతలు తిరస్కరించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఓ మరాఠీ చిత్రం ద్వారా ఆమె తొలిసారి గాయనిగా మారారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అత్యున్నత స్థాయికి ఆమె చేరుకున్నారు. వివిధ భాషల్లో లత దాదాపు 50 వేల పాటలను పాడారు.
ఒక్కో పాటకు ఆమె తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే ఉండేది. తొలి రోజుల్లో ఆమె ఒక్కో పాటకు రూ. 25 అందుకున్నారు. అనంతరం 1950లలో ఒక్కో పాటకు ఆమె రూ. 500 తీసుకునేవారు. అదే సమయంలో పేరున్న ఇతర సింగర్స్ కు రూ. 150 మాత్రమే ఇచ్చేవారు.
అనతికాలంలోనే ఆమె ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆ తర్వాత స్టార్ సింగర్ గా ఆమె భారీగా సంపాదించారు. చనిపోయేనాటికి ఆమె ఆస్తుల విలువ రూ. 200 కోట్లకు పైగానే ఉందనేది ఒక అంచనా. ముంబై సహా పలు నగరాల్లో ఆమెకు అత్యంత విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి.