Nagarjuna: బ్రోతల్ హౌస్ అన్నందుకు హీరో నాగార్జున కేసు పెడతా అన్నాడు.. పెట్టుకో అని నేను అన్నాను: సీపీఐ నారాయణ
- నాగార్జున అంటే నాకు ఇష్టమే
- బిగ్ బాస్ తర్వాత ఆయనంటే అసహ్యం ఏర్పడింది
- కేసీఆర్ నమ్మదగిన వ్యక్తి కాదు
ఏ విషయం గురించైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం సీపీఐ నేత నారాయణ నైజం. తన అభిప్రాయాలను ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆయన వ్యక్తీకరిస్తుంటారు. బిగ్ బాస్ రియాల్టీ షోపై కూడా ఆయన గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ ను ఆయన బ్రోతల్ హౌస్ అంటూ గతంలో విమర్శించారు. దీనిపై తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ... నాగార్జున అంటే తనకు ఇష్టమేనని... అయితే బిగ్ బాస్ తర్వాత ఆయనంటే తనకు అసహ్యం ఏర్పడిందని అన్నారు.
బిగ్ బాస్ ప్రోగ్రాంలో నాగార్జున ముగ్గురు అమ్మాయిలను పిలిచి... ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు? ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు? ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? అని అడుగుతాడని... ఆడపిల్లలను పట్టుకుని ఎవరైనా ఇలా అడుగుతారా? అని నారాయణ మండిపడ్డారు. అందుకే ఆయనంటే తనకు అసహ్యం ఏర్పడిందని చెప్పారు. అందుకే బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ అన్నానని తెలిపారు. బ్రోతల్ హౌస్ అన్నందుకు తనపై కేసు పెడతానని నాగార్జున అన్నాడని... పెట్టుకో అని తాను చెప్పానని అన్నారు.
ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మోదీని వ్యతిరేకించినట్టు ఉంటూనే, మోదీకి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ నమ్మదగిన వ్యక్తి కాదని అన్నారు. కావాలనే బీజేపీని కెలుక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు.