Revanth Reddy: టీఆర్ఎస్ నేతల అవినీతి పరాకాష్ఠకు చేరింది: రేవంత్ రెడ్డి
- అధికారం ఉన్నదే దోచుకోవడానికా?
- బరితెగించి తెగబడుతోన్న టీఆర్ఎస్ నేతలు
- అక్రమార్కులపై సమాన చర్యలు తీసుకుంటారా? అని రేవంత్ నిలదీత
''అక్రమ నిర్మాణాలను అడ్డుకునేదెవరు?'' పేరిట ''ఆంధ్రజ్యోతి'' దినపత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. హైదరాబాద్ శివారుల్లోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సామాన్యుల అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హడావుడి చేసిన అధికారులు ప్రజాప్రతినిధుల నిర్మాణాలను మాత్రం ముట్టుకోలేదని ఆ కథనంలో పేర్కొన్నారు.
జవహర్‌నగర్‌లో అక్రమ నిర్మాణంలో ఓ మంత్రి ఆసుపత్రి ఉందని, అలాగే, బోడుప్పల్, పీర్జాదిగూడలో కీలక నేతలు, నిజాంపేటలో కార్పొరేటర్లు అనుమతుల్లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు కట్టుకున్నప్పటికీ ఆ వైపు అధికారులు కన్నెత్తి చూడలేదని ఆ కథనంలో చెప్పారు. ఈ విషయాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
''అధికారం ఉన్నదే దోచుకోవడానికి, కబ్జాలు చేయడానికి అని బరితెగించి… తెగబడుతోన్న టీఆర్ఎస్ నేతల అవినీతి పరాకాష్ఠకు చేరింది. మునిసిపల్ శాఖ మంత్రి గారూ... అక్రమ నిర్మాణాలలో మీ వాటా ఎంత...? ఇప్పటికైనా అక్రమార్కులపై “సమాన” చర్యలు తీసుకుంటారా...?'' అని రేవంత్ రెడ్డి నిలదీశారు.