Women Police: పురుష టైలర్ తో నెల్లూరు జిల్లా మహిళా పోలీసులకు కొలతలు... స్పందించిన మహిళా కమిషన్

Male tailor takes measurements of Nellore district women cops

  • నెల్లూరు జిల్లా మహిళా పోలీసులకు కొత్త యూనిఫాం
  • పురుష టైలర్ తో కొలతలు
  • సెల్ ఫోన్ తో ఫొటోలు తీసిన ఓ వ్యక్తి
  • నెల్లూరు పోలీసుల ఆగ్రహం

నెల్లూరు జిల్లా మహిళా పోలీసులకు కొత్త యూనిఫాంలు అందించాలన్న పోలీసు శాఖ నిర్ణయం అనుకోని రీతిలో వివాదం రూపుదాల్చింది. మహిళా పోలీసులకు ఓ పురుష టైలర్ కొలతలు తీసుకోవడం పట్ల దుమారం చెలరేగింది. సదరు టైలర్ మహిళా పోలీసుల కొలతలు తీస్తుండగా, ఓ వ్యక్తి ఆ ప్రక్రియను సెల్ ఫోన్ తో ఫొటోలు తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

దీనిపై నెల్లూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. పురుష టైలర్ తో మహిళా పోలీసులకు కొలతలు తీయించడం అటుంచితే, కొలతలు తీస్తుండగా అనుమతి లేకుండా సెల్ ఫోన్ తో ఫొటోలు తీసిన వైనంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు రావడంతో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావుతో ఆమె మాట్లాడారు. ఘటనపై వివరణ కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. మహిళా టైలర్లతోనే యూనిఫాం కొలతల ప్రక్రియ జరిగేలా చూస్తామని, అదనపు ఎస్పీ వెంకటరత్నంకు దీనికి సంబంధించిన బాధ్యతలు అప్పగించినట్టు వెల్లడించారు.

అంతకుముందు ఈ ఘటనపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు మాట్లాడుతూ, యూనిఫాం కోసం కొలతలు తీస్తున్నప్పటి ఫొటోలు బయటికి వచ్చాయంటూ మహిళా పోలీసులు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. సెల్ ఫోన్ తో ఫొటోలు తీసిన వ్యక్తిని తాము గుర్తించామని ఆయన వెల్లడించారు. తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News