CM Jagan: అసమానతలు రూపుమాపేందుకు రామానుజాచార్యులు ఎంతో కృషి చేశారు: సీఎం జగన్
- ముచ్చింతల్ లో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు
- హాజరైన ఏపీ సీఎం జగన్
- రామానుజ బోధనలు ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్ష
- ఈ దిశగా కృషి చేస్తున్నారంటూ చిన్నజీయర్ కు అభినందనలు
ఏపీ సీఎం జగన్ శంషాబాద్ లోని ముచ్చింతల్ ఆశ్రమంలో విశ్వ సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల వారి సహస్రాబ్ది వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసమానతలు రూపుమాపేందుకు శ్రీ రామానుజాచార్యులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. వెయ్యేళ్ల కిందటే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి శ్రీ రామానుజాచార్యులు అని పేర్కొన్నారు.
సమతామూర్తి బోధనలను విశ్వవ్యాపితం చేసేలా గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న చిన్నజీయర్ స్వామికి అభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. రామానుజాచార్యుల వారి భావనలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ అభిలషించారు. అందరూ సమానులే అని సందేశం ఇచ్చేందుకే సమతామూర్తిని స్థాపించారని కొనియాడారు. సమతామూర్తి విగ్రహం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కాగా, ఈ కార్యక్రమానికి సీఎం జగన్ సంప్రదాయబద్ధంగా పంచెకట్టులో వచ్చారు. ఆయన వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా, వేదికపై నిల్చున్న జగన్ కు చెవిరెడ్డి పాదాభిందనం చేయడం కనిపించింది.