Karnataka: నా బిడ్డకు తండ్రివి నువ్వేనంటూ మహిళ వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కర్ణాటక ఎమ్మెల్యే

karnataka bjp mla rajakumara patil complaints against a woman

  • సోషల్ మీడియా ద్వారా తనపై చెడుగా ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే ఫిర్యాదు
  • బిడ్డ సంరక్షణ కోసం రూ. 2 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తోందని ఆరోపణ
  • పోలీసులు తనను బంధించారన్న మహిళ
  • న్యాయం చేయాలని వెళ్తే పోలీసులు వేధిస్తున్నారన్న ఆమ్ ఆద్మీ పార్టీ

తనకు పుట్టిన బిడ్డకు తండ్రివి నువ్వునంటూ ఓ మహిళ తనను వేధిస్తోందని కర్ణాటకలోని కలబురిగి జిల్లా సేడం బీజేపీ ఎమ్మెల్యే రాజకుమార్ పటిల్ తెల్కూరు విధాన సభ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ భూ వివాదం నిమిత్తం 2009లో ఆమె పరిచయం అయిందని, 2013లో ఓసారి కలిసి భూ వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోరినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత మరోమారు కలిసి తన కుమారుడి చదువు కోసం సాయం చేయాలని కోరినట్టు చెప్పారు. ఆ తర్వాత 2018 నుంచి సోషల్ మీడియా ద్వారా తనపై చెడుగా ప్రచారం చేయడం మొదలుపెట్టిందన్నారు.

తనపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని డబ్బు, నగల కోసం వేధించిందని ఆరోపించారు. గతేడాది మార్చిలో తనను కలిసి డిమాండ్లు పరిష్కరించాలని, ఇప్పుడేమో తన బిడ్డకు నువ్వే తండ్రివని వేధిస్తూ సంరక్షణ కోసం రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థులతో చేతులు కలిపి ఆమె ఈ ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజకుమార్ పాటిల్ ఆరోపించారు.

మరోవైపు, ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపుతోంది. పోలీసులు తనను బంధించారని బాధిత మహిళ ఆరోపించగా, న్యాయం చేయాల్సిన పోలీసులే ఆమెను వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఎమ్మెల్యే ద్వారా జరిగిన అన్యాయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రికి మొరపెట్టుకుందని, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరేందుకు విధానసభ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు అక్కడామెను నిర్బంధించారని ఆరోపించింది. దీంతో విధిలేక ఆమె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కుశల స్వామి అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలవాలని ఆమె కోరారు.

  • Loading...

More Telugu News