AP High Court: సినిమా థియేటర్‌కు తాళం వేసే అధికారం తహసీల్దార్‌కు ఎక్కడిది?.. వెంటనే తెరవండి: ఏపీ హైకోర్టు
- శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థియేటర్ సీజ్
- హైకోర్టును ఆశ్రయించిన థియేటర్ భాగస్వామి
- లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న జాయింట్ కలెక్టర్‌కు మాత్రమే ఆ హక్కు ఉంటుందని స్పష్టీకరణ
- ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు
సినిమా థియేటర్‌కు తాళం వేసే అధికారం తహసీల్దారుకు ఎక్కడిదంటూ ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ థియేటర్‌ను తెరవాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్వపరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాస మహల్‌ను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ మూసివేయించి తాళం వేశారు. దీంతో థియేటర్ మేనేజింగ్ పార్టనర్ ఎస్.శంకరరావు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ వ్యవహరించారని చెప్పారు. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం.. థియేటర్‌ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని స్పష్టం చేసింది. లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న జాయింట్ కలెక్టర్ అధికారమిచ్చిన వ్యక్తికి మాత్రమే జప్తు చేయాల్సి ఉంటుందని, కానీ ఆ అధికారాన్ని తహసీల్దార్‌కు జాయింట్ కలెక్టర్ ఇవ్వలేదని పేర్కొంది. కాబట్టి థియేటర్‌ను తిరిగి తెరవాలని న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశించారు.