Telangana: కరోనా థర్డ్ వేవ్ పూర్తిగా ముగిసిందని చెప్పుకోవచ్చు.. ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వద్దు: తెలంగాణ ప్రజారోగ్య శాఖ
- సమర్థంగా అన్ని చర్యలు తీసుకున్నాం
- రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గాయి
- పూర్తిగా మాత్రం కనుమరుగుల కాలేదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ పూర్తిగా ముగిసిందని చెప్పుకోవచ్చని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... థర్డ్ వేవ్ మొదలైనప్పటి నుంచి తాము సమర్థంగా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గాయని వివరించారు. అయితే, పూర్తిగా మాత్రం కనుమరుగుల కాలేదని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్లు వేయించుకోవాలని ఆయన చెప్పారు. టీకాలు తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. కరోనా కొత్త వేరియంట్లు పుట్టకుండా వ్యాక్సిన్ల వల్ల కట్టడి చేయొచ్చని చెప్పారు.
తెలంగాణలో ఫీవర్ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం కరోనా ఆంక్షలు సడలిస్తున్నామని చెప్పారు. ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ ల ఆలోచనను విరమించుకోవాలని ఆయన కోరారు.