Teachers: పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నుంచి వైదొలగిన ఉపాధ్యాయ సంఘాలు
- ఇటీవల మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి భేటీ
- తమకు న్యాయం జరగలేదని భావిస్తున్న ఉపాధ్యాయులు
- స్టీరింగ్ కమిటీలో కొనసాగలేమని స్పష్టీకరణ
- ఇకపై సొంతంగా కార్యాచరణ
ఇటీవల మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ జరిపిన చర్చల్లో తమకు న్యాయం జరగలేదని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. చర్చల సరళిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు నేడు ప్రకటించారు. చర్చల్లో స్టీరింగ్ కమిటీ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు తమకు ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు.
పీఆర్సీ కోసం తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని, తమతో కలిసి వచ్చే ఉద్యోగ, కార్మిక సంఘాలను కూడా కలుపుకుని ముందుకు వెళతామని ఉపాధ్యాయ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ మేరకు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్ బాబు, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ పేరిట ఓ ప్రకటనలో వివరించారు. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని, ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని తెలిపారు.