Jagananna Chedodu Scheme: వరుసగా రెండో ఏడాది 'జగనన్న చేదోడు' పథకం నిధులు విడుదల చేసిన సీఎం జగన్
- దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు లబ్ది
- ఒక్కొక్కరికి రూ.10 వేలు
- ఒక్క బటన్ క్లిక్ తో నగదు బదిలీ చేసిన సీఎం జగన్
- రూ.285.35 కోట్లు విడుదల
వరుసగా రెండో ఏడాది 'జగనన్న చేదోడు' పథకం కింద నిధులు విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఒక్క బటన్ క్లిక్ తో సీఎం జగన్ 2.85 లక్షల మంది దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.285.35 కోట్లు బదిలీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, రజకులు తమ కాళ్లపై తాము నిలబడగలిగేలా 'జగనన్న చేదోడు' పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. సాయం పేరుతో గత ప్రభుత్వం నాణ్యతలేని పరికరాలు ఇచ్చిందని, సాయం అందించడంలోనూ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. బీసీలంటే పనిముట్లు, వెనుకబడిన వర్గాలు కాదని... సమాజానికి వెన్నెముక అని నమ్మి నిండుమనసుతో వారికి మంచి చేస్తున్నామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం మంత్రి పదవులు ఇచ్చామని, అసెంబ్లీ స్పీకర్ పదవి బీసీలకే ఇచ్చామని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1.20 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 92 శాతం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని వివరించారు. మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 73 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చామని తెలిపారు. 427 ఎంపీపీ పదవులు, 18 ఎమ్మెల్సీలు, 9 జెడ్పీ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చామని సీఎం జగన్ వెల్లడించారు.