Nara Lokesh: పోలీసులతో లాఠీచార్జీ చేయడమేనా అక్కాచెల్లెమ్మలకు మీరిచ్చే బహుమతి!: సీఎంపై లోకేశ్ విమర్శలు
- బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద మహిళల ఆందోళన
- బలవంతంగా తరలించిన పోలీసులు
- తీవ్రస్థాయిలో స్పందించిన లోకేశ్
- ఎన్నాళ్లీ దౌర్జన్యాలు అంటూ ఆగ్రహం
విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ లోని మైథాన్ కంపెనీ కర్మాగారాన్ని తెరిచి తమకు ఉపాధి కల్పించాలంటూ మహిళా కూలీలు ఆందోళన దిగగా, పోలీసులు వారిని బలవంతంగా తరలించారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అన్న అన్నందుకు గన్ లు పట్టుకున్న పోలీసులను అక్కచెల్లెమ్మలపైకి పంపారా సీఎం జగన్ గారూ? అని ప్రశ్నించారు.
బొబ్బిలి గ్రోత్ సెంటర్ కి వేలాది ఎకరాలు ఇచ్చిన తమను కాదని, ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పించడం ఏంటని మైథాన్ కర్మాగారం వద్ద మహిళలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని లోకేశ్ వెల్లడించారు. వారిపై పోలీసులతో లాఠీచార్జి చేయడమేనా అక్కచెల్లెమ్మలకు మీరిచ్చే బహుమతి! అని మండిపడ్డారు. స్థానికులకు ఉపాధి కల్పించాలన్న డిమాండ్ చేయడం మీ దృష్టిలో నేరం అయితే, ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు అని జీవో తెచ్చి అమలు చేయని మీరు ఏ1 ముద్దాయి అని లోకేశ్ విమర్శించారు.
"మీ పాలనలో మహిళలకు భద్రత లేకపోగా, చివరికి ఉపాధి కోరుతూ రోడ్డెక్కితే చావగొట్టించారు. ఇది ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వం అని మీరెప్పుడో మర్చిపోయారు. రాజ్యంగబద్ధంగా పనిచేయాలనే సంగతి మీ పోలీసులకూ గుర్తు రాదు. నిరుపేద మహిళలపై ఎన్నాళ్లీ ఈ దౌర్జన్యాలు, దాడులు?" అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. బొబ్బిలిలో జరిగిన దాడిన తీవ్రంగా ఖండిస్తున్నానని, బాధిత మహిళలకు టీడీపీ అండగా ఉంటుందని నారా లోకేశ్ స్పష్టం చేశారు.