Hijab: కర్ణాటకలో ముదురుతున్న హిజాబ్ వివాదం... విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
- హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చిన ముస్లిం విద్యార్థినులు
- మొదలైన వివాదం
- కాషాయ కండువాలు ధరించి వస్తున్న విద్యార్థులు
- పలు జిల్లాల్లో ఘర్షణలు
ఇటీవల కర్ణాటకలో కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీల రావడం వివాదాస్పదంగా మారింది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి వస్తుండగా, కొందరు విద్యార్థులు వారికి పోటీగా మెడలో కాషాయ కండువాలు వేసుకుని తరగతులకు హాజరవుతున్నారు. ఇది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది.
ఉడుపి జిల్లాలో కుందాపుర ప్రభుత్వ కాలేజీకి ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రాగా, వారిని మెయిన్ గేటు వద్దే ఆపేశారు. వారిని లోనికి రానివ్వకుండా గేట్లు మూసేశారు. ఈ క్రమంలో ఉడుపి, మాండ్య జిల్లాల్లో విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి.
మరోవైపు హిజాబ్ అంశం కర్ణాటక హైకోర్టులో విచారణకు వచ్చింది. అల్లర్లు, ఘర్షణల పట్ల న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థులు సంయమనం పాటించాలని సూచించింది. రేపు తదుపరి విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు, పాఠశాలలు మూసివేయాలని ఆదేశిస్తున్నట్టు సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.