Uttar Pradesh: విద్యార్థులకు ఉచితంగా స్కూటర్లు ఇస్తామన్న బీజేపీ.. ఉచితంగా పెట్రోలు పోయిస్తామన్న ఎస్పీ.. పోటాపోటీగా మేనిఫెస్టోల విడుదల
- ఎన్నికలకు రెండు రోజుల ముందు మేనిఫెస్టోల విడుదల
- లవ్ జిహాద్‌కు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష: బీజేపీ
- ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న ఎస్పీ
తమకు మళ్లీ అధికారం ఇస్తే ‘లవ్ జిహాద్’కు పాల్పడిన వారికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని చెబుతూ యూపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ‘లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర -2022’ పేరిట రూపొందించిన ఈ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న విడుదల చేశారు.
కుటుంబానికో ఉద్యోగం, వచ్చే ఐదేళ్లపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, చెరుకు రైతుకు రెండు వారాల్లో బిల్లులు, ఆలస్యమైతే మిల్లుల యజమానుల నుంచి వడ్డీ వసూలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కూటర్లు, విద్యార్థులకు రెండు కోట్ల ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఉచితంగా అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. పూర్తి వసతులతో జిల్లాకో ఆసుపత్రి నిర్మించడంతోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో ఇటీవల మరణించిన జనరల్ బిపిన్ రావత్ పేరిట బుందేల్‌ఖండ్‌లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
బీజేపీ మేనిఫెస్టో అలా విడుదల చేసిందో లేదో.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా మేనిఫెస్టో విడుదల చేశారు. బీజేపీ మేనిఫెస్టోకు ఏమాత్రం తగ్గకుండా హామీల వరద పారించారు. సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో కోటి, ఐటీ రంగంలో 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎస్పీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది.
అలాగే, విద్యాశాఖలో ఖాళీల భర్తీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, అమ్మాయిలకు పీజీ వరకు ఉచిత విద్య, 2025 నాటికి రైతులను రుణ విముక్తులను చేయడం, రెండెకరాల లోపు ఉన్న వారికి ఎరువులు, బీపీఎల్ దిగువనున్న కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు నెలకు 3 లీటర్లు, ద్విచక్ర వాహనదారులకు లీటరు పెట్రోలు ఉచితంగా అందిస్తామని ఎస్పీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.