rupees: 10 రూపాయిల కాయిన్లు చెల్లుబాటు: కేంద్ర సర్కారు స్పష్టీకరణ
- అన్ని లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు
- ఆర్బీఐ ముద్రించే రూ.10 నాణేలు అమల్లోనే ఉన్నాయి
- రాజ్యసభకు తెలిపిన సహాయ మంత్రి పంకజ్ చౌదరి
రూ.10 రూపాయల కాయిన్లను ఏదైనా దుకాణంలో ఇస్తే తీసుకోమంటూ తిరస్కరించిన అనుభవం చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. వాటిని ఎవరూ తీసుకోకపోవడంతో, తమ వద్దే ఉండిపోతున్నాయంటూ చాలా మంది ఇబ్బందిగానూ భావిస్తున్నారు. కానీ, 10 రూపాయి నాణేలు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు.
రాజ్యసభలో ఒక సభ్యుడు దీనిపై ప్రశ్న వేయడంతో మంత్రి స్పందించారు. రూ.10 కాయిన్లు చెల్లుబాటు కావడం లేదా? వీటి కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? అంటూ ఏఐఏడీఎంకే ఎంపీ విజయ్ కుమార్ ప్రశ్నించారు.
దీనికి మంత్రి స్పందిస్తూ.. ఆర్బీఐ ముద్రించే రూ.10 కాయిన్లను అన్ని రకాల లావాదేవీలకు వినియోగించుకోవచ్చని చెప్పారు. అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని బదులిచ్చారు. ఇందుకు సంబంధించి ప్రజల్లో అవగాహన కోసం ఆర్బీఐ పత్రికా ప్రకటనలు ఇస్తున్నట్టు చెప్పారు.