Telangana: తెలంగాణపై సీఎంకు అసలు ఆసక్తే లేదు.. కేసీఆరే మా అస్త్రం: బండి సంజయ్
- పెప్పర్ స్ప్రే కొట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు?
- కేసీఆర్ కేబినెట్ లో ఎంత మంది ఉద్యమకారులున్నారు?
- అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి
- సుష్మా స్వరాజ్ పోరాడితేనే కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టిందన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కొత్తగా రాయాలంటున్న సీఎం కేసీఆర్.. రాజ్యాంగం వల్ల ఆయనకు కలిగిన ఇబ్బంది ఏంటన్నది ఇప్పటిదాకా చెప్పలేదని విమర్శించారు. కాంగ్రెస్ ను తిడితే టీఆర్ఎస్ కు కలిగే బాధేంటని అన్నారు. సీఎం కేసీఆర్ కు గుణపాఠం చెబుతామని, ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కేసీఆరే తమకు అస్త్రమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతల డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు.
పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు పెప్పర్ స్ప్రే కొట్టింది కాంగ్రెస్ అని, ఆ టైంలో కేసీఆర్ ఎక్కడున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ప్రే కొట్టినా పారిపోకుండా దృఢంగా నిలబడి తెలంగాణ ఏర్పాటుకు సుష్మా స్వరాజ్ మద్దతు తెలిపారని గుర్తు చేశారు. బిల్లు పెడతారా? లేదా? అని ఆమె నిలదీస్తేనే కాంగ్రెస్ బిల్లు తెచ్చిందన్నారు. మోదీ ఏమైనా తెలంగాణ బిల్లును అడ్డుకున్నారా? అని నిలదీశారు. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అందరి దృష్టిలో ఒక జోకర్ అయ్యారన్నారు.
పక్క రాష్ట్రం ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకోకుండా ఫాం హౌస్ లో పడుకుంటున్న సీంఎ కేసీఆర్ కు అసలు తెలంగాణపై ఆసక్తి లేదని, కేసీఆర్ కేబినెట్ లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులున్నారని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ తీరుతో ఉద్యమంలో బలిదానాలు చేసుకున్న అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఏమైనా లాఠీ దెబ్బలు తిన్నారా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం పెట్టరని, కేసీఆర్ విగ్రహం పెట్టుకుంటారని అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎంపై ఆయన మండిపడ్డారు.