WHO: కరోనా తదుపరి వేరియంట్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ వో ప్రకటన
- ఒమిక్రాన్ చివరిది కాదన్న కొవిడ్ టెక్నికల్ లీడ్ మరియా కెర్ఖోవె
- తర్వాతి వేరియంట్ మరింత శక్తిమంతమైనదని కామెంట్
- ఒమిక్రాన్ కన్నా ఎక్కువ వ్యాప్తి చెందుతుందని హెచ్చరిక
- వ్యాక్సిన్లకూ ఆ వేరియంట్లు లొంగవని వార్నింగ్
ఒమిక్రాన్ తో కరోనా అంతం కాదని, తదుపరి మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. తదుపరి వచ్చే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ మరింత ఎక్కువ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ వో కొవిడ్ –19 టెక్నికల్ లీడ్ మరియా కెర్ఖోవె అన్నారు. కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కన్నా శక్తిమంతమైనదని చెప్పారు. భవిష్యత్ లో వచ్చే వేరియంట్లు తీవ్రమైనవా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.
కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన కొద్దీ అవి రోగనిరోధక శక్తిని తప్పించుకుని తిరుగుతాయని హెచ్చరించారు. దాని వల్ల ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు పనిచేయవని పేర్కొన్నారు. అయితే, జబ్బు తీవ్రం కాకుండా, మరణాలు నమోదు కాకుండా ఇప్పటి వ్యాక్సిన్లు కాపాడుతాయని చెప్పారు. వీలైనంత వరకు వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయాలని ఆమె సూచించారు. సీజనల్ గా కరోనా సోకే ప్రమాదం కూడా పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చారు.