Gujarat Titans: ‘గుజరాత్ టైటాన్స్’ పేరుతో బరిలోకి అహ్మదాబాద్ జట్టు
- అధికారికంగా ప్రకటించిన సీవీసీ క్యాపిటల్
- జట్టు గుజరాత్ కోసం ఎంతో సాధిస్తుంది
- అందుకనే టైటాన్స్ పేరును నిర్ణయించాం
- సీవీసీ పార్ట్ నర్ సిద్ధార్థ పటేల్
ఐపీఎల్ లో ఈ ఏడాది కొత్తగా అరంగేట్రం చేయనున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ‘గుజరాత్ టైటాన్స్’గా పేరును ఖరారు చేసింది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని బ్రిటన్ కు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ సొంతం చేసుకోవడం తెలిసిందే. ఇందుకు రూ.5,625 కోట్లతో బిడ్ వేసి విజయం సాధించింది.
అహ్మదాబాద్ టైటాన్స్ గా బరిలో దిగుదామని లోగడ నిర్ణయానికి వచ్చిన సీవీసీ క్యాపిటల్.. తాజాగా ‘గుజరాత్ టైటాన్స్’ పేరును ఖరారు చేసి అధికారికంగా ప్రకటించింది. ‘‘ఈ జట్టు గుజరాత్ కోసం ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నది మా ఆకాంక్ష. ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే టైటాన్స్ పేరును ఎంపిక చేసుకున్నాం’’ అని సీవీసీ పార్ట్ నర్ సిద్ధార్థ పటేల్ తెలిపారు.
సరైన ఆటగాళ్లను వేలంలో సొంతం చేసుకోవడం ద్వారా మంచి సమతూకంతో జట్టును రూపొందించగలమన్న విశ్వాసాన్ని పటేల్ వ్యక్తం చేశారు. ఈ జట్టు వద్ద ఆటగాళ్ల కొనుగోళ్లకు ఇంకా రూ.52 కోట్లు మిగిలి ఉన్నాయి. మరో కొత్త ఫ్రాంచైజీ లక్నోను ఆర్పీఎస్జీ గ్రూపు సొంతం చేసుకోవడం తెలిసిందే. ఇందుకు భారీగా రూ.7,090 కోట్ల బిడ్ వేసి గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ గా పేరు ఖరారు చేసింది.
ఈ రెండు జట్ల చేరికతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ క్రికెట్ ప్రియులకు మరింత వినోదాన్ని పంచనుంది. ఈ నెల 12,13 తేదీల్లో బెంగళూరులో ఆటగాళ్ల మెగా వేలం కూడా జరగనుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. అలాగే రషీద్ ఖాన్, శుభమ్ గిల్ ను జట్టు వేలానికి ముందే ఎంపిక చేసుకుంది.