TRS: విభజనపై వ్యాఖ్యల ఫలితం... తెలంగాణ వ్యాప్తంగా మోదీ దిష్టిబొమ్మల దగ్ధం
- ఉమ్మడి రాష్ట్ర విభజన సరిగా లేదన్న మోదీ
- మండిపడుతున్న టీఆర్ఎస్ నేతలు
- రాష్ట్రవ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు
- కదం తొక్కుతున్న టీఆర్ఎస్ శ్రేణులు
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఆగ్రహావేశాలు రగిల్చాయి. ముఖ్యంగా, అధికార టీఆర్ఎస్ పార్టీ మోదీ అంటేనే మండిపడుతోంది.
మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. రాష్ట్రంలోని పలు పట్టణాల్లో నల్ల జెండాలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణపై మోదీ విషం చిమ్ముతున్నారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు మోదీ వ్యతిరేక నినాదాలతో మార్మోగిపోయాయి.
నారాయణపేట నియోజకవర్గంలో జాతీయ రహదారిపై మోదీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో నల్లజెండాలు చేతబూని, నల్లకండువాలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందినవారు కూడా స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు.
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సైతం నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
అటు, ఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోదీ తెలంగాణపై అసందర్భోచితంగా వ్యాఖ్యలు చేశారని, తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్న ఆ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ఎంపీలు నామా నాగేశ్వరరావు, కవిత, రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.