Karnataka: ప్రియాంక గాంధీ బికినీ కామెంట్లపై.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
- బికినీ, హిజాబ్, జీన్స్ ధరించడం మహిళల హక్కు అన్న కాంగ్రెస్ నేత
- రాజ్యాంగం ప్రసాదించిందని కామెంట్
- ఈ కామెంట్లతో దిగజారిపోయారన్న బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య
- మహిళల వస్త్రధారణ వల్లే రేప్ లు జరుగుతున్నాయని వ్యాఖ్య
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఎంత ముదురుతోందో తెలిసిందే. కాలేజీలోకి హిజాబ్ ను అనుమతించకపోవడంతో విద్యార్థినులు చేపట్టిన ఆందోళన.. పెను దుమారాన్నే రేపింది. మూడు రోజుల పాటు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించేదాకా వెళ్లింది పరిస్థితి.
దీనిపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. బికినీ అయినా, మేని ముసుగైనా, జీన్స్ అయినా, హిజాబ్ అయినా.. ఏదైనా వేసుకోవడం మహిళల హక్కు అని కామెంట్ చేశారు. అది మహిళలకు రాజ్యాంగం ప్రసాదిస్తున్న ప్రాథమిక హక్కు అని, మహిళలను వేధించడం మానుకోవాలని వ్యాఖ్యానించారు.
అయితే, ఆమె వ్యాఖ్యలపై బీజేపీ కర్ణాటక ఎమ్మెల్యే రేణుకాచార్య స్పందించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బికినీ అని కామెంట్ చేయడంతోనే ప్రియాంక గాంధీ ఎంత దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చంటూ కామెంట్ చేశారు. కాలేజీకి, స్కూలుకు వెళ్లినా విద్యార్థులంతా నిండుగా బట్టలేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. మహిళల వస్త్రధారణ వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని, మగవారిని రెచ్చగొడుతున్నారని ఆయన వివాదం రేపారు. అది సరికాదన్నారు. మహిళలకు మన దేశంలో ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్యానించారు.