Prasidh Krishna: ప్రసిద్ధ్ కృష్ణ సంచలన స్పెల్... 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్
- అహ్మదాబాద్ లో టీమిండియా వర్సెస్ విండీస్
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్
- 50 ఓవర్లలో 9 వికెట్లకు 237 పరుగులు
- లక్ష్యఛేదనలో విండీస్ తడబాటు
రెండో వన్డేలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ సంచలన బౌలింగ్ తో అదరగొట్టాడు. 238 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన వెస్టిండీస్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ తో వడివడిగా వికెట్లు చేజార్చుకుంది. తన స్పెల్ లో 5 ఓవర్లు వేసిన ప్రసిద్ధ్ కేవలం 4 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. ఈ స్పెల్ లో 2 మెయిడెన్లు కూడా ఉన్నాయి. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (18), డారెన్ బ్రావో (1), కెప్టెన్ నికోలాస్ పూరన్ (9)ల వికెట్లు ప్రసిద్ధ్ ఖాతాలో చేరాయి.
మరోవైపు చహల్, శార్దూల్ ఠాకూర్ కూడా సమయోచితంగా బౌలింగ్ చేయడంతో విండీస్ 76 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 29 ఓవర్లలో 5 వికెట్లకు 110 పరుగులు కాగా, విజయం సాధించాలంటే ఇంకా 21 ఓవర్లలో 128 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో షామ్రా బ్రూక్స్ 38, అకీల్ హోసీన్ 8 పరుగులతో ఆడుతున్నారు.