Sunil Gavaskar: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ప్రయోగాలపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి

Sunil Gavaskar opines on Team India experiments with batting order
  • విండీస్ తో రెండో వన్డేలో జట్టులోకి రాహుల్
  • మిడిలార్డర్ లో వచ్చిన వైనం
  • ఓపెనర్ గా రిషబ్ పంత్
  • ఈ నిర్ణయం సరికాదన్న గవాస్కర్
వెస్టిండీస్ తో రెండో వన్డేలో రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉన్నప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఓపెనర్లుగా బరిలో దిగడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. మిడిలార్డర్ లో వచ్చిన రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో పెద్దగా రాణించింది లేదు. 18 పరుగులు చేసి అవుటయ్యాడు. కాగా, బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ప్రారంభించడం అనేది చివరి ఆప్షన్ గానే ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ గానీ, శిఖర్ ధావన్ గానీ ఓపెనర్ గా బరిలో దిగుంటే బాగుండేదని గవాస్కర్ పేర్కొన్నాడు. ధాటిగా ఆడే ఎడమ చేతివాటం ఆటగాడే ఓపెనర్ గా కావాలనుకుంటే ఇషాన్ కిషన్ ను ఆడించవచ్చని అన్నాడు.

కొవిడ్ తో బాధపడుతున్న రుతురాజ్ గైక్వాడ్ కోలుకుంటే, ఓపెనింగ్ స్థానానికి అందుబాటులో ఉంటాడని, అతడిని ఆడించడం కూడా మంచి ఆప్షన్ అవుతుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లో గత కొన్ని సీజన్లలో రుతురాజ్ ఫామ్ ను చూశామని, దురదృష్టవశాత్తు కరోనా వల్ల దూరంగా ఉన్నాడని వివరించాడు. కాగా, వెస్టిండీస్ తో తొలి వన్డేలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించడం తెలిసిందే. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ 60, కిషన్ 28 పరుగులు చేశారు.

అయితే రెండో వన్డేకు కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో కిషన్ ను పక్కనబెట్టి రాహుల్ కు చోటు కల్పించారు. కానీ రాహుల్ ను ఓపెనర్ గా కాకుండా, మిడిలార్డర్ లో బరిలో దింపడం విమర్శకులకు పని కల్పించింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో టీమిండియా వ్యూహకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
Sunil Gavaskar
Batting Order
Team India
KL Rahul
Rishabh Pant

More Telugu News