India: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే భారీగా పెరగనున్న పెట్రో ధరలు: డెలాయిట్ ఇండియా

Petrol price hikes as soon as assembly elections Over

  • గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు
  • లీటరుపై రూ. 8-9 పెరిగే అవకాశం
  • చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం అదుపు చేయడం సవాలే
  • డెలాయిట్ పార్ట్‌నర్ దేబాశిష్ మిశ్రా

గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెరగడం ఖాయమని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్‌పీ (డెలాయిట్ టచీ తోమత్సు ఇండియా) తెలిపింది. అప్పటి వరకు ధరల పెరుగుదల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ఆ సంస్థ పార్ట్‌నర్ దేబాశిష్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు చమురు, గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

అంతర్జాతీయంగా చమరు ధరల్లో జరిగే హెచ్చుతగ్గులకు అనుగుణంగానే దేశీయంగా ఈ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపును ఈ సంస్థలన్నీ పక్కనపెట్టేశాయి. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందన్న కారణంతో ప్రభుత్వ ఆదేశాలతో ఈ సంస్థలన్నీ ధరల పెంపును తాత్కాలికంగా పక్కనపెట్టాయి.

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వం చమురు ధరలను ముట్టుకోదని మిశ్రా అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మార్చి 10వ తేదీ తర్వాత లీటరుపై 8 నుంచి 9 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా పన్ను రూపంలో ప్రభుత్వం ఎంతో కొంత తగ్గిస్తుందని, మిగిలిన భారాన్ని ప్రజలే మోయాల్సి ఉంటుందని అన్నారు.

పెట్రో ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతాయని అన్నారు. అంతర్జాతీయంగా కనుక బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటును అదుపు చేయడం భారత్‌కు సవాలే అవుతుందని పేర్కొన్నారు. అలాగే, చమురు ధరలు 10 డాలర్లు పెరిగితే దేశ వృద్ధిలో 0.3 నుంచి 0.35 శాతం మేర కోత పడుతుందని మిశ్రా వివరించారు.

  • Loading...

More Telugu News