RBI: హమ్మయ్య రుణ రేట్లు పెరగడం లేదు..! మరోసారి కనికరించిన ఆర్బీఐ.. కీలక రేట్లు యథాతథం

RBI keep rates unchanged continued accomodative stance
  • రెపో రేటు 4 శాతం
  • రివర్స్ రెపో 3.35 శాతం
  • ద్రవ్యోల్బణం నియంత్రణల్లోనే
  • లిక్విడిటీ కావాల్సినంత ఉంది
  • వివరాలు తెలిపిన ఆర్బీఐ గవర్నర్ 
కీలక విధాన రేట్లలో ఆర్బీఐ ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో రుణ గ్రహీతలపై అదనపు భారం పడకుండా వెసులుబాటు లభించింది. సర్దుబాటు విధానాన్నే (అకామడేటివ్ స్టాన్స్) కొనసాగించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు వృద్ధికి మద్దతుగా నిలుస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) చివరి సమీక్ష గురువారం ఉదయం ముగిసింది. ఎంపీసీ కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు.

ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద ఉండగా, తదుపరి ఏప్రిల్ సమీక్ష వరకు ఇవే రేట్లు కొనసాగనున్నాయి. కీలక రేట్లను ఆర్బీఐ మార్చకపోవడం వరుసగా పదో ద్వైమాసిక సమీక్షలోనూ పునరావృతం అయింది. సర్దుబాటు ధోరణి అంటే.. పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైతే మరింత లిక్విడిటీని వ్యవస్థలోకి జొప్పించేందుకు, వడ్డీ రేట్లు తగ్గించేందుకు వెసులుబాటును కలిగి ఉండడం. ఈ వైఖరిపైనే వడ్డీ రేట్ల పెంపు ఆధారపడి ఉంటుంది.

తదుపరి ఆర్థిక సంవత్సరం 2022-23లో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండొచ్చని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) మోస్తరు స్థాయికి దిగొచ్చినప్పటికీ, ఇంకా మిగులుగానే ఉందన్నారు. అంతర్జాతీయ సవాళ్లు, సంక్షోభాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలుస్తామని తెలిపారు. ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీకి శక్తికాంతదాస్ చీఫ్ గా ఉన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న చమురు ధరలను దేశీయంగా ద్రవ్యోల్బణానికి రిస్క్ గా శక్తికాంతదాస్ పేర్కొన్నారు. అయితే ఆహారోత్పత్తుల ధరలు శాంతించడం అనుకూలిస్తుందన్నారు. వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్) ఎగసినప్పటికీ ఇది భరించగలిగే స్థాయిలోనే ఉన్నట్టు చెప్పారు.

టోకు ధరల ద్రవ్యోల్బణం మాత్రం గరిష్ఠాల్లో కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. ఇది ప్రస్తుత త్రైమాసికంలో తారస్థాయికి చేరి తర్వాత తగ్గుముఖం పట్టొచ్చన్నారు. 2021-22 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉంటుందని.. ఇది 2022-23లో 4.5 శాతానికి దిగొస్తుందని అంచనా వేశారు.

దేశ ఆర్థిక వృద్ధి రికవరీపై కరోనా మూడో విడత ప్రభావం ఉందని అంగీకరించారు. అయినా, ప్రపంచంలో భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధితో దూసుకుపోతున్నట్టు శక్తికాంతదాస్ చెప్పారు.
RBI
mpc
repo
reverse repo
shakthikanth das

More Telugu News