Venkaiah Naidu: వీఐపీలు ఏడాదికి ఒక్కసారే శ్రీవారిని దర్శించుకోవాలి.. నేను అలాగే చేస్తున్నాను: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
- శ్రీవారి దర్శనంతో సంతృప్తి లభిస్తుంది
- ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం వస్తుంది
- హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలన్న వెంకయ్య నాయుడు
తిరుమల తిరుపతి శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ స్వాగతం పలికారు. ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వెంకయ్య నాయుడికి వేదాశీర్వచనం ఇచ్చారు. ఆలయ ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలను వెంకయ్య నాయుడికి అందజేశారు.
స్వామివారి దర్శనం అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనంతో లభించిన సంతృప్తితో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం లభిస్తుందని అన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ దేశ సాంప్రదాయాలను కొనసాగిస్తూ, ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు.
శ్రీవారి దర్శన భాగ్యం అందరికీ ఏ ఇబ్బందులు లేకుండా దక్కాలని అన్నారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే స్వామి వారిని దర్శించుకోవాలని చెప్పారు. ఈ విధానాన్ని తాను కూడా పాటిస్తున్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు. తాను తన మనవరాలు సుష్మ వివాహానికి హాజరవ్వడానికి తిరుమల వచ్చానని వివరించారు. పుష్పగిరి మఠంలో నిరాడంబరంగానే వివాహం చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, వెంకయ్య నాయుడి కుమార్తె దీపా వెంకట్ కూతురు సుష్మ పెళ్లి కిషన్ అనే అబ్బాయితో జరగనుంది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పుష్పగిరి మఠం వద్దకు వెంకయ్య నాయుడు వెళ్లారు. ఈ వివాహ వేడుకకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరవుతారు.