BJP: నీట్ కు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసుపై పెట్రోల్ బాంబులతో దాడి
- చెన్నైలో దాడికి పాల్పడిన దుండగులు
- ఒక రౌడీ షీటర్ అరెస్ట్
- మూడు బాంబులు విసిరినట్టు వెల్లడి
వైద్య విద్య ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పట్ల తమిళనాడు మొదటి నుంచీ వ్యతిరేకత చూపిస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది విద్యార్థులు సీటు సంపాదించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దానిని రద్దు చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం నీట్ కు వ్యతిరేకంగా చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు.
ఘటనకు సంబంధించి వినోదన్ అనే రౌడీ షీటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మూడు సీసాల్లో పెట్రోల్ నింపి వాటిని బీజేపీ ఆఫీసుపైకి విసిరాడు. కాగా, బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు టీ నగర్ డీసీపీ హరి కిరణ్ ప్రసాద్ చెప్పారు. నిందితుడు గతంలో కూడా ఇలా పెట్రోల్ బాంబులతో దాడులకు పాల్పడ్డాడని వెల్లడించారు. మాదకద్రవ్యాలకు బానిస అని, ఇప్పటికే అతడిపై గూండాయాక్ట్ కింద కేసు కూడా నమోదైందని తెలిపారు.
దాడిలో ఎంత మంది పాల్గొన్నారో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. కాగా, దాడి ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆఫీసుకు తరలివస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కూడా ఆఫీసును పరిశీలించనున్నారు.