Andhra Pradesh: ఏ కులమైనా ఎస్టీ సర్టిఫికెట్ వస్తోంది.. ఏపీలో ఆగిపోయిన కులధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీ!
- సాఫ్ట్ వేర్ లో తలెత్తిన సమస్యలు
- సర్టిఫికెట్ల జారీని ఆపేసిన ఉన్నతాధికారులు
- సాఫ్ట్ వేర్ అప్ డేట్ అవుతోందని వివరణ
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సాఫ్ట్ వేర్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కులధ్రువీకరణ పత్రం కోసం ఏ సామాజికవర్గానికి చెందిన వారు దరఖాస్తు చేసినా... వారికి ఎస్టీ సర్టిఫికెట్ వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సర్టిఫికెట్ల జారీని నిలిపివేశారు. గత రెండు రోజులుగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ ఆగిపోయింది.
ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన షేక్ షబ్బీర్ కుల ధ్రువీకరణ పత్రం కోసం స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఆయన షేక్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని పేర్కొంటూనే ఎస్టీ సర్టిఫికెట్ జారీ అయింది. మాల సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళకు కూడా ఎస్టీ సర్టిఫికెట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ క్రమంలో అధికారులు మాట్లాడుతూ సాఫ్ట్ వేర్ అప్ డేట్ అవుతోందని... ఈ ప్రక్రియ పూర్తికాగానే సర్టిఫికెట్లను జారీ చేస్తామని చెప్పారు.