Atchannaidu: దొంగల్లా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?: అచ్చెన్నాయుడు
- జగన్ అరాచకత్వంతో కూడిన పాలన చేస్తున్నారు
- అశోక్ బాబు తప్పు చేయలేదని గత విచారణలో తేలింది
- అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలన్న అచ్చెన్న
తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ ఆయనను అరెస్ట్ చేసింది. నిన్న రాత్రి ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ అంశంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిన జగన్.. అరాచకత్వంతో కూడిన పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. అశోక్ బాబు అరెస్టును ఖండిస్తున్నామని చెప్పారు.
అర్ధరాత్రి పూట దొంగల్లా వచ్చి అశోక్ బాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అశోక్ బాబుపై వచ్చిన ఆరోపణల్లో ఆయన ప్రమేయం ఏమీ లేదని గత విచారణలోనే తేలిందని... అయినప్పటికీ కుట్రపూరితంగా మళ్లీ కేసు పెట్టడం దారుణమని అన్నారు.
పీఆర్సీ అంశంలో ఉద్యోగుల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారనే కడుపుమంటతోనే జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష సాధిస్తోందని విమర్శించారు. అక్రమ కేసులకు భయపడేవారు ఇక్కడెవరూ లేరని అన్నారు. అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.