Budda Venkanna: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విద్యార్హతలపై బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు

Budda Venkanna asks Alla Ramakrishnareddy educational qualifications
  • విద్యార్హతల వివాదంలో అశోక్ బాబు అరెస్ట్
  • ఆళ్ల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసిన బుద్ధా
  • ఆళ్ల ఇంటర్వ్యూ వీడియోను పంచుకున్న టీడీపీ నేత
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అధికారులు విద్యార్హతలకు సంబంధించిన వివాదంలో అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ నేతలు వైసీపీపై ఎదురుదాడికి దిగారు. టీడీపీ అగ్రనేత బుద్ధా వెంకన్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విద్యార్హతలపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూకి సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ ను కూడా బుద్ధా పంచుకున్నారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి గారూ... అసలు మీ చదువు ఏది? ఏది నిజం? అని ప్రశ్నించారు. "మీ అఫిడవిట్ లో నాలుగు ఏళ్ల డిప్లొమా కోర్స్ 1989లో ఉత్తీర్ణులైనట్టు రాశారు. కానీ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో, 1987లో జాయిన్ అయి, 1991లో పాస్ అయ్యానని అంటున్నారు. ఇందులో ఏది నిజం? అఫిడవిట్ లో ఎందుకు తప్పుగా పేర్కొన్నారు?" అని నిలదీశారు.

"ఇందాక మీరు చెప్పిన అసిస్టెంట్ కథలో మైసూర్ ఓపెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ మొదలు పెట్టి మధ్యలో ఆపాను అన్నారు. వీడియోలో మాత్రం ఆంధ్రా ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మొదలుపెట్టి ఆపేశాను అంటున్నారు. అసలు ఏది నిజం? మీరు ఏం చదివారో, ఎక్కడ చదివారో కూడా తెలియదా? మీరు ఇంటర్ కూడా పాసవ్వలేదని అంటున్నారు. మరి ఎన్నికల సంఘాన్ని మోసం చేసినందుకు విచారణకు సిద్ధమా? ఇలా ఫేక్ చేస్తున్నారు కనుకనే మీ వెనుక చూసుకోమనేది" అంటూ బుద్ధా ట్విట్టర్ లో స్పందించారు.
Budda Venkanna
Alla Ramakrishna Reddy
Education
Qualifications

More Telugu News