Revanth Reddy: ఇలా చేయకపోతే కేసీఆర్, కేటీఆర్ తెలంగాణలో తిరగలేని పరిస్థితి: వీడియో పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి
- యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అనీల్ అరెస్టు
- అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానన్న రేవంత్
- 2023 ఎన్నికల తర్వాత తండ్రీకొడుకులు ఇళ్లకే పరిమితమంటూ వ్యాఖ్య
తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనీల్ ను అరెస్టు చేస్తుండగా తీసిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు.
''యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనీల్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసుల రక్షణ వలయం, మా కార్యకర్తల అరెస్టులు, గృహ నిర్బంధాలు లేనిదే కేసీఆర్, కేటీఆర్ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఉంది. 2023 ఎన్నికల తర్వాత తండ్రీకొడుకులు ఇళ్లకే పరిమితం కావడం తథ్యం. అదీ కాంగ్రెస్ తోనే సాధ్యం'' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. యాదాద్రి కొండను సందర్శిస్తారు. దీంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.