Ravichandran Ashwin: ఐపీఎల్ మన్కడింగ్: ఒకే జట్టుకు కలిసి పనిచేయడంపై అశ్విన్, బట్లర్ రియాక్షన్
- డ్రెస్సింగ్ రూం షేరింగ్ పై కామెంట్లు
- ఎంత బాగా ఉంటుందో చూడాలన్న అశ్విన్
- ఆత్రుతగా చూస్తున్నానన్న బట్లర్
2019 ఐపీఎల్ లో అశ్విన్ మన్కడింగ్ ను మరచిపోగలమా? బంతి వేయకముందే జోస్ బట్లర్ క్రీజు దాటి వెళ్లడం.. అశ్విన్ వెంటనే ఆగి వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి. బట్లర్ ను అవుట్ గా ప్రకటించడంతో అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ అశ్విన్ పై ప్రతి ఒక్కరూ విమర్శలు గుప్పించారు. అయితే, ఆనాడు ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు.. ఇప్పుడు సహచరులుగా మారిపోయారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నారు.
ఈ నేపథ్యంలోనే బట్లర్ తో డ్రెస్సింగ్ రూంను పంచుకునే విషయంపై అశ్విన్, బట్లర్ లు స్పందించారు. మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ తనను ఎంపిక చేసుకోవడం ఆనందంగా ఉందని అశ్విన్ చెప్పాడు. 2018లోనే తనను దక్కించుకునేందుకు రాజస్థాన్ తీవ్రంగా ప్రయత్నించినా కుదర్లేదని, ఎట్టకేలకు ఆ జట్టుకు ఎంపికవడం ఆనందంగా ఉందని తెలిపాడు. డగౌట్ లో అందరితోనూ తనకు మంచి రిలేషన్స్ ఉన్నాయన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ కోసం తాను చేయాల్సిందంతా చేస్తానన్నాడు. యుజ్వేంద్ర చహల్ తో కలిసి బౌలింగ్ చేసేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపాడు. బట్లర్ తో కలిసి డ్రెస్సింగ్ రూం పంచుకోవడం ఎంత బాగుంటుందో వేచి చూడాలని కామెంట్ చేశాడు.
బట్లర్ కూడా దీనిపై పాజిటివ్ గా స్పందించాడు. ఓ వీడియో మెసేజ్ ఇచ్చాడు. ‘‘హే యాష్.. నేను జోస్. కంగారు పడకు నేను క్రీజులోపలే ఉంటాలే. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పింక్ జెర్సీలో నిన్ను చూసేందుకు ఎదురు చూస్తున్నా. నీతో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం కోసం ఎంతో ఆత్రుతగా ఉన్నాను’’ అని పేర్కొన్నాడు.