Air India: నగలు ధరించే విషయంలో సిబ్బందికి సూచనలు చేసిన ఎయిరిండియా
- ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్
- సంస్థపై తనదైన ముద్ర వేయాలనుకుంటున్న టాటాలు
- తాజాగా కీలక ఉత్తర్వులు జారీ
ఇటీవలే ఎయిరిండియా విమానయాన సంస్థను టాటా గ్రూప్ కొనుగోలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సంస్థలో సమూల మార్పులకు టాటా గ్రూప్ శ్రీకారం చుట్టింది. నగలు ధరించడంపై తాజాగా సిబ్బందికి సూచనలు చేసింది. ఎయిరిండియా విమాన సిబ్బంది పరిమితంగానే నగలు ధరించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత షాపింగ్ చేయడంపైనా ఆంక్షలు విధించింది. తద్వారా కస్టమ్స్, సెక్యూరిటీ చెకప్ ల వద్ద తనిఖీల కోసం సమయం వృధా అవడాన్ని తగ్గించవచ్చని పేర్కొంది.
అంతేకాదు, విమానం ఎక్కిన తర్వాత ప్రయాణికుల ముందు ఆహార పదార్థాలు తినడం, పానీయాలు తాగడం చేయరాదని వెల్లడించింది. యూనిఫాం విషయంలోనూ కచ్చితంగా నిబంధనలకు లోబడి నడుచుకోవాలని, ప్రయాణికుల్లో ఎయిరిండియా పట్ల సదభిప్రాయం కలిగేలా నడుచుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎయిరిండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వసుధ చందన ఉత్తర్వులు జారీ చేశారు.