Terrorists: అల్ ఖైదా ఉగ్రవాదుల ఘాతుకం... ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్
- దక్షిణ యెమెన్ లో ఘటన
- ఐదుగురు సిబ్బందిని అపహరించిన ఉగ్రవాదులు
- పలు డిమాండ్లు చేసిన ఉగ్రవాదులు
- ప్రయత్నాలు ప్రారంభించిన ఐరాస, యెమెన్ ప్రభుత్వం
అల్ ఖైదా ఉగ్రవాదులు ఉనికిని చాటుకునేందుకు బలంగా ప్రయత్నిస్తున్నారు. దక్షిణ యెమెన్ లో ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బందిని కిడ్నాప్ చేశారు. అల్ ఖైదా ఉగ్రవాదులు వీరిని అజ్ఞాత ప్రదేశానికి తరలించారు. ఉగ్రవాదులు తమ వారిని విడుదల చేయడంతో పాటు, కొంత డబ్బు కూడా డిమాండ్ చేసినట్టు వెల్లడైంది.
దీనిపై సమాచారం అందుకున్న ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగింది. అటు యెమెన్ ప్రభుత్వం కూడా ఉగ్రవాదుల నుంచి బందీలను విడిపించేందుకు చర్యలు ప్రారంభించింది. కిడ్నాప్ కు గురైన వారిలో నలుగురు యెమెన్ దేశీయులు కాగా, మరొకరు విదేశీయుడిగా గుర్తించారు.
గత కొంతకాలంగా యెమెన్ లో కిడ్నాప్ ల సంఖ్య భారీగా పెరిగింది. అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థలకు చెందినవారు, స్థానిక సాయుధ తెగలకు చెందినవారు కిడ్నాప్ లను ఆదాయ వనరుగా భావిస్తుండడమే అందుకు కారణం.