govindananda: 'దైవద్రోహం చేస్తున్నారు'.. టీటీడీపై గోవిందానంద సరస్వతి విమర్శలు
- హనుమంతుడి జన్మస్థలం పేరిట టీటీడీ నకిలీ పుస్తకం వేసిందన్న గోవిందానంద
- సన్యాసులను, ప్రజలను టీటీడీ మోసం చేస్తోందని వ్యాఖ్య
- అంజనాద్రి పేరుతో దుకాణాల ఏర్పాటుకు యత్నాలంటూ విమర్శలు
తిరుమల తిరుపతి దేవస్థానం దైవద్రోహం చేస్తోందని హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... హనుమంతుడి జన్మస్థలం పేరిట టీటీడీ నకిలీ పుస్తకం ముద్రించిందని ఆయన ఆరోపించారు. సన్యాసులను, ప్రజలను టీటీడీ మోసం చేస్తోందని, అంజనాద్రి పేరుతో తిరుమలలో దుకాణాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నారని విమర్శించారు.
డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి యత్నిస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు. మరోవైపు, రూ.1200 కోట్లతో కిష్కింద అభివృద్ధికి కర్ణాటక సీఎం ఇప్పటికే ప్రకటన చేశారని, కిష్కిందలోని పంపా తీరంలోనే హనుమంతుడు పుట్టాడని అందరూ అంగీకరించారని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్ షా అక్కడకు వెళ్లి ఈ విషయాన్ని ఒప్పుకున్నారన్నారు. టీటీడీకి చెందిన వారు హనుమంతుడి జన్మస్థలం విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తూ దైవ ద్రోహం చేస్తున్నారని, సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.