CM Jagan: రాష్ట్ర చరిత్రలో ఒక ఏడాదిలో ఇంత డబ్బు ఎప్పుడూ ఇవ్వలేదు, ఖర్చుచేయలేదు: సీఎం జగన్
- నేవీ ఆంక్షలు ఉన్నాయన్న సీఎం జగన్
- రాత్రిపూట ల్యాండింగ్ కష్టంగా ఉందని వెల్లడి
- బీచ్ కారిడార్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని వివరణ
విశాఖ బీచ్ కారిడార్ అంశంపై సీఎం జగన్ స్పందించారు. విశాఖలో ఇప్పుడున్న విమానాశ్రయంలో పౌర విమానాల రాకపోకలపై నిరంతరం ఆంక్షలు ఉంటున్నాయని అన్నారు. పైగా, రాత్రి పూట ల్యాండింగ్ కూడా నేవీ ఆంక్షల కారణంగా మరింత కష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బీచ్ కారిడార్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
విశాఖ బీచ్ కారిడార్ రోడ్డు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలవాలని తెలిపారు. విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకునేలా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే, భోగాపురం నుంచి నగరానికి వీలైనంత త్వరగా చేరుకునేలా ఉండాలని వివరించారు. ఈ రోడ్డును ఆనుకుని టూరిజం ప్రాజెక్టులు వస్తాయని సీఎం జగన్ వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్వహణను పట్టించుకోలేదని, ఆ తర్వాత వర్షాలు బాగా పడడంతో రోడ్లు మరింత దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రభుత్వ హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్టు వక్రీకరించి విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై తాము అత్యధిక శ్రద్ధ చూపుతున్నామని, రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు రూ.2,205 కోట్లు ఇచ్చిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక ఏడాదిలో ఇంత డబ్బు ఎప్పుడూ ఇవ్వలేదు, ఖర్చుచేయలేదు అని సీఎం జగన్ స్పష్టం చేశారు.